back

అమలాపురం సభలో పవన్ వ్యాఖ్యలు ...Share via:

* ప్రజాపోరాటయాత్ర ఇ అంటే ఇచ్ఛాపురం నుండి మొదలుపెట్టి అ అంటే అమలాపురానికి చేరుకుంది. ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ గుండెతడితో హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
* తెలుగుజాతి ఆడపడుచులకు నమస్కారములు. కోనసీమ ఆడపడుచులు ముత్యాల మూటలు, తొలకరి జల్లులు. మీరు ఇచ్చిన ప్రేమ ద్వారా ప్రజాపోరాటయాత్ర ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అమలాపురంలో ముగియనీయనుంది.
* కోనసీమ సత్తా నాకు తెలుసు కాని ఎప్పుడూ ఇక్కడకి రాలేదు. దేశ భక్తిని, భారతదేశ సూర్య సంపదను గుండెల్లో పెట్టుకున్న ఊరు అమలాపురం.

* కోనసీమ కొదమ సింహాలు, మబ్బుల్లో పరిగెత్తే అగ్గి పిడుగులు...అవినీతిని అంతం చేసే కొదమ సింహాలు అయిన జనసైనికులకు ధన్యవాదములు.
* రాజోలులో కోనసీమ కత్తి ఇచ్చారు, ఈరోజున కొబ్బరి పొత్తు ఇచ్చారు..అందమైన కొబ్బరి పొత్తును నేను మొదటిసారిగా పట్టుకుంటున్నాను.
* మనిషిలో చాలా శక్తి ఉంది. మనమందరం మనలో శక్తి లేదు, ఒక్కరిమే అనుకుంటాం..రాజకీయాలకు పెట్టిపుట్టాలని అనుకుంటాము. కొబ్బరి పొత్తు గింజలోనే ఎంతో శక్తి దాగి ఉన్నప్పుడు మనలో ఎందుకు ఉండదు.
* లోకేష్ గారి తాతలా మా తాత గారు ముఖ్యమంత్రి కాదు, జగన్ గారి నాన్నలా మా నాన్న గారు ముఖ్యమంత్రి కాదు..మా నాన్న గారు చిన్నపాటి పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు మా పొలాలు అమ్ముకున్నప్పుడు మా ఇంట్లో వారి కన్నీళ్లు చూసాను.

* అర్జెంటీనా విప్లవకారుడు చే గువేరా అంటే నాకు ఇష్టం. కులాలతోటి, మతాలతోటి రాజకీయాలను చిన్నాభిన్నం చేసే మన రాజకీయ నాయకులు ఒకవైపు..తన దేశం కాకపోయినా వేరే దేశం వెళ్లి ప్రజల కోసం పోరాటం చేసిన చే గువేరా ఇంకోవైపు. మనిషి ఎక్కడైతే దోపిడీకి గురవుతున్నాడో వారికి న్యాయం చెయ్యాలని చే గువెరాని ఆదర్శంగా తీసుకుని నేను రాజకీయాల్లోకి వచ్చాను.
* అంబేద్కర్ గారిని గౌరవించమంటారు, మహాత్ముడికి నివాళులు అర్పించమంటారు..భగత్ సింగ్ బలిదానాన్ని గుర్తుపెట్టుకోమంటారు..ఇన్ని చెప్పే రాజకీయ నాయకులు వాళ్ళు ఇవి పాటించకుండా దోపిడీ, అవినీతి చేస్తున్నారు.
* సినిమాల్లో సమస్యలు పరిష్కరించొచ్చు కానీ నిజజీవితంలో పరిష్కరించడం కష్టం. నేను సినీ నటుడిగా రాజకీయాల్లోకి రాలేదు, 15 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.
* గోటితో పోయే దానిని గొడ్డలి దాకా ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తారు. పాలకులు చేసిన తప్పులకు తెలంగాణాలో ద్వితీయ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదు.
* తెలంగాణ నాయకులు ఏమీ చెయ్యని ఆంధ్రప్రజలను తిడుతూ ఉంటే నాకు బాధ కలిగింది. వాళ్ళు తిట్టుకోవాలంటే పాలకులను తిట్టుకోవాలి.

* ప్రజాస్వామ్య దేశంలో మేము ఎక్కడైనా బతికే హక్కు ఉంది, అలాంటిది మనల్ని తెలంగాణాలో ద్వితీయ శ్రేణులుగా చూస్తే ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు మాట్లాడలేదు. జగన్ గారు ఓట్లు అడుగుతారు తప్ప ఆంధ్ర ప్రజలను తిడితే తిరిగి తెలంగాణ నాయకులను తిట్టే దమ్ము లేదు.
* నాకు అ అంటే అమలాపురం, అనంతపురం అనిపిస్తాయి..ఇ అంటే ఇచ్ఛాపురం అనిపిస్తుంది కానీ తెలుగుదేశం వారికి అ అంటే అమరావతి అని మాత్రమే అనిపిస్తుంది.
* చంద్రబాబు గారు ఎప్పుడు అమరావతి చుట్టూనే తిరుగుతున్నారు. కోనసీమ వంటి అందమైన ప్రాంతాలను వదిలేస్తున్నారు.
* ఈ ప్రాంతంలో అన్ని కులాలు, అన్ని మతాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి కులాల పేరుతో, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారు. విద్వేషాలు ఆపడానికే నేను కులాల, మతాల ఐక్యత గురించి మాట్లాడతాను.

* నా దగ్గర పనిచేసే మనిషి తెలంగాణాలో దశాబ్దాల పాటు ఉన్నా ఆయన చనిపోతే ఖననానికి కూడా తెలంగాణ వారు స్థలం ఇవ్వలేదు. ఈ సంఘటనతో నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఆంధ్ర ప్రజలను తిడితే తాట తీస్తా అని తెలంగాణ నాయకులకు చెప్పాను.
* ముఖ్యమంత్రి అవుతామంటూ తిరిగే లోకేష్ గారు గాని, జగన్ గారు గాని ఆంధ్ర ప్రజలను తిడుతుంటే ఏరోజైనా తెలంగాణ నాయకులను ఎదురించారా? వారిని ఎదురించలేని వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంట...
* భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంటే భరించలేక నేను పార్టీ పెట్టాను..చావడానికైనా సిద్దపడి పార్టీ స్థాపించాను.. సో కాల్డ్ నాయకులు ఇంట్లో కొంగుచాటు దాకుంటున్నారు.

* నేను 2014లో పార్టీ పెట్టి ఓట్లు చీలకుండా అనుభవం ఉన్న నాయకుడికి మద్దతు తెలిపాను. చంద్రబాబు గారి గురించి అన్ని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశానికి మద్దతు తెలిపాను.
* జగన్ గారు గాంధీజీ లాగా, మండేలా గారిలా పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదు...కోట్ల స్కాములు చేసి జైలుకి వెళ్లారు.
* పరిశుద్ధంగా ఉన్న మనసులోనే దేవుడు వస్తాడని వచ్చేటప్పుడు ఒక చర్చ్ దగ్గర చూసాను..మన రాజకీయ నాయకుల్లో పరిశుద్ధత ఎక్కడ ఉంది..అందరూ అవినీతి, దోపిడీలే చేస్తున్నారు.
* చంద్రబాబు గారి మాటలు తేనే, మనసు విషం అని తెలిసి కూడా మద్దతు తెలిపాను..పార్టీ పెట్టిన మూడు సంవత్సరాల వరకు నన్ను అనేక మంది తిట్టారు. సమయం చూసి అందరికీ అవినీతి తెలియచేద్దామని వేచి చూసాను, ఈరోజు మీ ముందుకు వచ్చి వారు చేస్తున్న అక్రమాలను తెలిజేస్తున్నాను.
* ఒక ఆకు రౌడీ, గాలి రౌడీ అయిన ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిని చెప్పుతో కొట్టినా ఆయన మీద చంద్రబాబు గారు స్పందించలేదు. అదే వ్యక్తి పోలీసులను తిట్టాడు, కులాల పేరుతో ప్రజలను దూషించాడు, మీడియాను తిట్టాడు అయినా చంద్రబాబు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదంతా చూసి చూసి భరించలేక మార్చ్ 14 న వారు చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేసాము.
* ఇచ్ఛాపురం నుండి ప్రతీ చోట మన సభలకు వచ్చే వారిని కొడతాము, కేసులు పెడతాము అని బెదిరిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు, చాలా మంది రాజకీయ నాయకులను చూసి ఉంటారు గాని నాలాంటోడిని చూసి ఉండరు.
* ఆయిల్, గ్యాస్ దోపిడీ మీద మాట్లాడే ధైర్యం ఒక్కరికీ లేదు, జనసేన పార్టీకు..నాకు ఆ ధైర్యం ఉంది.

* నగరంలో జరిగిన గ్యాస్ సంఘటనలో అధికారుల పిల్లలు చనిపోతే మీరు చూస్తూ కూర్చుని ఉండేవారా? మీవి మాత్రమే ప్రాణాలా? మా పిల్లలవి కాదా? అభివృద్ధిని వాళ్ళు అనుభవిస్తున్నారు..చావును, దెబ్బలను మనకి ఇస్తున్నారు. వీటి మీద జనసైనికులు నిలదీస్తారు..విసిగిపోయి ఉన్నాం, దెబ్బకు దెబ్బ కొట్టి మాట వినేలా చేస్తాం..
* 2006లో అంబానీ గారు వచ్చి.. ఆంధ్రప్రదేశ్ కి సంపదను ఇచ్చిన తర్వాతే మేము తీసుకుంటాం అని చెప్పి మోసం చేసి సంపదను మహారాష్ట్రకు తరలించేసారు. దీని మీద అడిగే దమ్ము ఒక్కడికి కూడా లేదు. ఈ దుర్మార్గులకు ఎప్పుడు మనస్సు కరుగుతుంది..కనికరం, జాలి, దయ రావా మీకు..సిగ్గుండాలి ఛీ మీ బతుకు చెడ...
* కాలుష్యం కులాలను, మతాలను వేరు చెయ్యదు..గ్యాస్ లీకైతే అన్ని కులాలను, అన్ని మతాల ప్రజలను ఒకేలా చంపేస్తాది. కావున అందరం ఒకే తాటిపై లేకపోతె మనల్ని అంబానీలు, రాజకీయ నాయకులు మోసం చేస్తూనే ఉంటారు.
* ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు లేవు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లు లేవు..వీటి మీద అడిగేవారు లేరు. రిలయన్స్ వారు చంద్రబాబు గారికి, జగన్ గారికి, లోకేష్ గార్కి ముడుపులు ఇచ్చి ఉంటారు..అందుకే వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు.

* మాట్లాడితే జగన్ గారు తలలు నిమురుతారు, బుగ్గలు నిమురుతారు..లోకేష్ గారు సైకిల్ తొక్కుతారు..చంద్రబాబు గారు ఓటు వెయ్యమంటారు కానీ రిలయన్స్ ను ఎదురించరు..ముఖ్యమంత్రి గారు మాది రాయలసీమ చరిత్ర అంటారు, అలాంటిది రిలయన్స్ వారిని ఎందుకు నిలదీయలేకపోతున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఈ ప్రాణాల గురించి ఎందుకు భయపడుతున్నారు.
* వాడికి భయపడి, వీడికి భయపడి, వాడెమ్మ మొగుడికి భయపడి అనే సామెతలాగా...చంద్రబాబు గారికి భయపడి, జగన్ గారికి భయపడి, రిలయన్స్ వారికి భయపడి, ongc వారికి భయపడితే ఇక ఎందుకు ఈ జీవితం..
* కర్ర విరక్కుండా పాముని చంపే రాజకీయాలు పోయాయి..ఒక సమస్య మీద డైరెక్ట్ గా ఏదోకటి మాట్లాడండి, రెండు మాటలు మాట్లాడొద్దు, ఒక తప్పు ఉంటె తప్పు అని చెప్పండి. చిన్న కోడి కత్తి గుచ్చుకుంటే ఏడ్చి గగ్గోలు పెడుతున్నారు. కోడి కత్తి గుచ్చుకున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయకుండా జగన్ గారు ఏడుస్తున్నారు.
* కోడి కత్తి పొడిచిన వెంటనే తెలుగుదేశం వారు అది చేసింది జనసేన వాళ్ళు అనే రంగు పులమడానికి ప్రయత్నించారు. పాలసీల మీద మాట్లాడే మేము ఇలాంటి చిల్లర రాజకీయాలు చెయ్యము. మేము బాధ్యతతో రాజకీయాలు చెయ్యడానికి వచ్చాము. ఇలాంటి చిల్లర రాజకీయాలు చెయ్యము.
* డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు ఉన్నవాడు అవుతున్నాడు తప్పితే ఉద్యోగాలు లేని వారు మాత్రం ఇంకా అలానే మిగిలిపోతున్నారు. రాజకీయ నాయకులు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలను తోక్కేస్తున్నారు.
* ముఖ్యమంత్రి గారు మాట్లాడితే విజన్ 2020 అంటారు..ఆ విజన్ 2020 ఆయనకు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు తీసుకునే ఘటనలు అణగారిన వర్గాల ప్రజలను, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి.

* భూ సేకరణ చట్టం వల్ల కుల ఘర్షణలు సృష్టిస్తున్నారు. అమరావతి భూములను తీసుకునేటప్పుడు సరైన పద్ధతులు పాటించమని నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరించాను.
* సింగపూర్ తరహా పాలన అంటారు..సింగపూర్ లో 30 ఎకరాలు తీసుకుంటే వేల ఉద్యోగాలు ఇస్తారు, ఇక్కడ మాత్రం వేల ఎకరాలు తీసుకున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు.
* మా భాష యాస లను అగౌరపరుస్తున్నారనే కారణంతో తెలంగాణ విడిపోయింది..అలాంటిది కోనసీమ సంపదను దోచేస్తుంటే ఎలాంటి ఉద్యమాలు వస్తాయో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి.
* నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అశోక గజపతిరాజు గారు నన్ను ఎవరు అని అడిగారు? ఆయన తరపున ప్రచారం చేసినప్పుడు నేను ఎవరో ఆయనకు తెలియదా? నేను ఆయనను అంటే ఆయనను అన్నట్టే!!ఆయన సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు..అలాగే నేను ముఖ్యమంత్రి గారిని అంటే ఆయనను అన్నట్టే! ఆయన సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు.
* ముఖ్యమంత్రి గారు మాట్లాడితే 2050 అంటారు..నిత్యం యవ్వనుడిలా ఉంటా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. దొడ్లో దున్నపోతు ఈనిందంటే వంటింట్లోకి వెళ్లి వెండి గిన్నె తీసుకురా అన్నట్టు ఉంటుంది చంద్రబాబు గారి అభివృద్ధి..ఆయన అభివృద్ధి పేపర్ల మీద తప్పితే నిజరూపం దాల్చవు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి దున్నపోతు పాలు ఇచ్చినట్టు ఉంటాది.

* మాములు మనుషుల మధ్య ధర్మం బతికుంది తప్పితే డబ్బున్న రాజకీయ నాయకుల దగ్గర లేదు. సెంటు భూమి వున్న రైతు డబ్బున్నోళ్ల గురించి ఆలోచిస్తుంటే డబ్బున్నవాళ్ళు మాత్రం పేదోళ్ల గురించి ఆలోచించరు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోనసీమను దోపిడీకి గురికానివ్వదు.
* స్థూల జాతీయ ఉత్పత్తి గురించి మాత్రమే ఇప్పటి వాళ్ళు మాట్లాడుతున్నారు, జనసేన ప్రభుత్వం స్థూల ప్రజల సంతోషం గురించి కూడా ఆలోచిస్తుంది.
* కోనసీమకు రైల్వే లైన్ కావాలని దశాబ్దాల కాలం నుండి అడుగుతున్నాము. రాం విలాస్ అనే మంత్రి వాళ్ళ ఊరికి రేల్వే జోన్ తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి ఎలాగూ పట్టించుకోవట్లేదు, కనీసం కోనసీమకు రైల్వే జోన్ తీసుకురాలేరా?
* కోనసీమ నేలలో ఒక శక్తి ఉంది, కోనసీమ గాలిలో శక్తి ఉంది. యువత ఎప్పుడూ బైక్ ల మీద తిరుగుతూ స్పీడ్ గా వెళ్ళడానికి కారణం వాళ్ళు ఉద్యోగాలు లేకుండా కాళీగా ఉండడమే!!ఆవేశం, శక్తి ఉన్న యువతకు ఇక్కడ సరైన క్రీడా సదుపాయాలు లేవు.
* కోనసీమలో యుద్ధ విద్య నేర్పే శిక్షణ కార్యాలయాలను నిర్మించాలి..కోనసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తాం.
* ఆడపడుచుల కొరకు మహిళా బ్యాంకులను ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగుల కొరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం..గృహిణులకు గ్యాస్ ఉచితంగా అందిస్తాం..పనికిమాలిన బియ్యం బదులుగా ప్రతీ గృహిణి అకౌంట్ లోకి 2500 - 3500 రూపాయలు జమ చేస్తాము.
* సామాజిక న్యాయం అని అందరూ మాట్లాడతారు. అంబేద్కర్ గారి ఆశయాలను పాటించాలని చెప్తారు. అలాంటిది ఎస్సీ, ఓసి, బీసీ హాస్టళ్లు అని ఎందుకు పెడుతున్నారు. కులాలు వద్దు అంటూ చిన్నప్పుటి నుండే పిల్లలను వేరు చేస్తున్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కామన్ స్కూల్, కామన్ హాస్టళ్ల వ్యవస్థను తీసుకొస్తాము.
* సామాన్యులు డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి జనసేన అందించింది. మనకొచ్చే జనమే మార్పుకి సంకేతం..చంద్రబాబు, జగన్ గారి సభలకు మనకొచ్చినంత జనం రారు. అవసరమైతే నేను మీ కోసం చచ్చిపోతా..రిలయన్స్ వారికి నేను భయపడను.

* మంత్రి నారాయణ గారు నాకు చిన్నప్పుడు నుండి తెలుసు. నారాయణ గారు నెల్లూరులో ట్యూషన్ చెప్పేవారు, అలాంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేసారు.
* ప్రతీ మండలానికి ఒక మహిళా డిగ్రీ కాలేజీ నిర్మిస్తాము..డాక్టర్లకు క్వార్టర్స్ నిర్మిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తాము. వృద్దులకు ఆశ్రమాలు జనసేన ప్రభుత్వం స్థాపిస్తుంది.
* కోనసీమ నుండి ఇతర దేశాలకు వెళ్లే వారికి చాలా సమస్యలు ఉన్నాయి, వారికి జనసేన అండగా ఉంటాది. ప్రతీ కులం వారు కార్పొరేషన్ అడుగుతున్నారు. కచ్చితంగా కార్పొరేషన్లు స్థాపిస్తాం కానీ ఎదొక రోజు కులాలకు కార్పొరేషన్లు అవసరం లేకుండా జనసేన పాలన ఉంటాది.
* అందరు వేసే చెత్తను తీసే రెల్లి కులస్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అలాంటి వారిని ఎవరూ పట్టించుకోకపోవడం నన్ను బాధకు గురిచేసింది. అందుకే నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. వెనుకబడిన కులాల యువత మార్పు కోరుకుంటున్నారు.
* పవన్ కళ్యాణ్ ని చూడాలంటే యూ ట్యూబ్ లో చూడొచ్చు, ఇంత వరకు రానవసరం లేదు..యువత మార్పు కోరుకుంటుంది కాబట్టే ఈరోజు ఇంతమంది యువత సభకు వచ్చారు.
* వచ్చే ఎన్నికల్లో జగన్ గారు ప్రభుత్వాన్ని స్థాపించలేరు అని నేను కోనసీమ నుండి బలంగా చెప్తున్నాను. తెలుగుదేశానికి రోజులు అయిపోయాయి..జనసేన అండగా ఉంటేనే గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. జనసేన పార్టీ ఉదయిస్తున్న సూర్యుడు..కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని జనసేన ఏర్పాటు చేస్తుంది.

* 2009లో అవమానాలు పడ్డాము, దెబ్బ తిన్నాము, వెటకారాలు, ఛీత్కారాలు పడ్డాము..మనలో ఇంకా పౌరుషం, ఆత్మాభిమానం ఉంది..మాట అంటే వెనకడుగు వెయ్యకుండా వెన్ను చూపే ధైర్యం మాలో ఉంది.
* 200లో నన్ను చాలా మంది వెటకారం చేశారు, మీ వల్ల రాజకీయాలు సాధ్యపడతాయా? అని చాలా మంది నన్ను వెక్కిరించారు..అలా అన్న ప్రతీ చవటకి ఈరోజున నేను సమాధానం చెప్తున్నాను. ఆరోజు మేము సామాజిక న్యాయం కోసం వచ్చాము. అన్ని కులాలు బాగుండాలని ఆరోజు వచ్చాము. కులాల ఐక్యత గురించి మేము మాటల్లో చెప్పలేదు, చేతల్లో చేసి చూపించాము. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అన్ని కులాలను కలుపుకుని ముందుకు సాగుతాము.
* సమస్యలకు పరిష్కారం కావాలంటే ప్రజల అవసరాలను గుర్తించే పాలకులు కావాలి..అలాంటి పాలకులను జనసేన అందిస్తుంది.
* లోకేష్ గారిలా నేను సైకిల్ తొక్కుతూ..జగన్ గారిలా పాదయాత్ర చేస్తూ పబ్బం గడపను. కోనసీమకు రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మన డ్రైనేజీ సమస్యలు తీరే వరకు నేను మీకోసం పనిచేస్తాను.
* మార్చ్ లో ఎన్నికలు ఉంటాయి..అందరూ కష్టపడండి..అందరూ నన్ను భయపెడదామని చూస్తారు, నేను ఒక్కడినైనా ప్రయాణిస్తా గాని భయపడను. ధవళేశ్వరం కవాతు ఒక్కడితో ప్రారంభమయ్యి 10 లక్షల మందితో ముగిసింది.
* పవన్ కళ్యాణ్ అండగా నిలబడతాడని భావిస్తే జనసేన కు ఓటు వెయ్యండి. చంద్రబాబు గారు, జగన్ గారు మనకోసం పనిచేయలేదు..లోకేష్ గారు ఎలాగూ మన కోసం పని చెయ్యరు. నేను మీ కోసం నా పసిపిల్లలను వదులుకుని వచ్చాను, మీరంటే నాకు అంత ఇష్టం..
* ఆసుపత్రులలో గైనకాలజిస్ట్ లు లేరు, స్కూల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు...ఇలాంటి ఆడపడుచుల సమస్యలు నేను తీరుస్తాను.
* ఇబ్బందికర ప్రదేశాల్లో లిక్కర్ షాపులు ఉంటె వాటిని ఇతర ప్రదేశాలకు తరలిస్తాము..ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తే బెల్టు తీసుకుని కొడతాము. మద్యానికి చాలా మంది బానిసలు అయిపోతున్నారు.
* 2019 చాలా కీలకమైన సంవత్సరం..మార్పుకి సంకేతం కాబోతుంది. వచ్చే ఎన్నికలు చాలా కష్టమైన ఎన్నికలు. అంబేద్కర్ గారి వేలు ఎప్పుడూ నీ భవిష్యత్తుని ఓటుతో బంగారంలా కాపాడుకో అని సూచిస్తుంది.
* ఓటు అనే ఆయుధంతో టీడీపీని, వైసీపీని రానివ్వకుండా..అదే ఆయుధంతో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము.

* రాహువు పట్టిన పట్టు ఒక్క సెకండు అఖండమైన లోకభాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్కుడు గడియారంలో ముల్లుని కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందులైపోతుందా? ధనుజులోకమేకంగా దారికి అడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? కుటిలాత్మక కూటమికొక్క తృటికాలపు జయమొస్తే విశ్వసృష్టి విచ్ఛిన్నం అవుతుందా? జనసేన ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ అడ్డుపడలేరు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరి ఆశయాలను నెరవేరుస్తాం.
* యువతలో అపారమైన, అద్వితీయమైన శక్తి ఉంది. ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఇలా ఉన్నాడంటే నాకన్నా ఎక్కువ చదువుకున్న మీరు నాకన్నా పెద్ద స్థాయికి వెళ్లేలా నేను చేస్తాను.
* ఏ పార్టీలోనూ మువ్వెన్నల జెండా చూడము..ఒక్క జనసేన సభలకు వచ్చే యువతే మువ్వెన్నెల జెండా మోస్తారు..మువ్వెన్నెల జెండా మొయ్యాలంటే గుండెల్లో ధైర్యం కావాలి,హృదయంలో పరిశుద్ధత ఉండాలి. అలాంటి మువ్వెన్నెల జెండా జనసేన జెండాల మధ్య ఎగురుతుంటే నా గుండె ఉప్పొంగుతుంది. భారత్ మాతాకీ జై...

Tags : Pawan Kalyan, Janasena Party, Amalapuram

Write a comment ...
Post comment
Cancel