back

175 స్థానాల్లో పోటీ ... యువతకు ప్రాధాన్యం - జనసేన



Share via:

మొన్నటి చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా ఏర్పడిన పొత్తుల గందరగోళానికి నిన్న జనసేన పార్టీ తెరదించింది. ఏదో మొక్కుబడిగా కాకుండా సూటిగా తమ అభిప్రాయం చెప్పేసింది. అదే విషయాన్ని నిన్న జరిగిన విశాకపట్నం నాయకుల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తేల్చేసాడు.


"జనసేన పార్టీ వాళ్లతో కలుస్తుందీ, వీళ్లతో కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాకు అన్ని స్థానాలు ఇచ్చిందీ, ఇన్ని స్థానాలు ఇచ్చిందనీ రకరకాల ప్రచారాలతో జనసేన శ్రేణుల్ని గందరగోళానికి గురి చేసి స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలే. అధికారపక్ష నాయకులు సైతం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కూడా గందరగోళానికి గురి చేసేందుకే. 2014లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం కొన్ని పార్టీలకి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు సమతుల్యత కోసం జనసేన పార్టీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. 25 సంవత్సరాలపాటు యువత భవిష్యత్తుకి అండగా ఉండాలన్న లక్ష్యంతో కొత్త తరం నాయకత్వం వైపు చూస్తున్నాం.

అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు 175 స్థానాల్లో ఎక్కువశాతం యువతకే అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలు, యువతతో పాటు కొత్తతరం బయటికి రావాలి. చట్టసభల్లో అడుగుపెట్టాలి. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీలకి చెందిన జిల్లా స్థాయి నాయకులు గానీ, రాష్ట్ర స్థాయి నాయకులు గానీ జనసేనతో మేం మాట్లాడేశాం, స్థానాలు ఇచ్చేశాం అని చేసే ప్రచారాలు నమ్మవద్దు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. భావితరాల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నాం. దయచేసి అధికార, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దు. ఇలాంటి వార్తల్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ముక్తకంఠంతో ఖండించాల"ని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థాపించింది ఒక ఎన్నికల కోసం కాదు భావి తరాల భవిష్యత్తు కోసమని శ్రీ పవన్కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

Tags : PawanKalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel