back

రివ్యూ : వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్Share via:

వరిణ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఇందులో వరుణ్ తేజ్ పూర్తి-నిడివి గల గద్దలకొండ గణేష్ మాస్ పాత్రను పోషిస్తున్నాడు, ఇది తమిళ హిట్ జిగర్తాండ సినిమా రీమేక్. అందాల నటి పూజా హెగ్డే , తమిళ హీరో అధర్వ మురళి ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. మరి గద్దలకొండ గణేష్ గా వరుణ్ ఎంత వరకు మెప్పించారో సమీక్షలో చూద్దాం.

క‌థ‌ అభి (అథ‌ర్వ‌)కి సినిమాలంటే పిచ్చి. జీవితంలో ఇంకో ఉద్యోగం చేసుకుని రాజీప‌డ‌టం అత‌నికి చేత‌కాదు. అందుకే త‌న‌కు న‌చ్చిన సినిమా ద‌ర్శ‌క‌త్వం చేద్దామ‌ని అనుకుంటాడు. త‌న బాబాయ్ జ‌ర్న‌లిస్ట్ కావ‌డంతో అత‌ని స‌హాయంతో ఓ పేరున్న ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో చేరుతాడు. అయితే సెట్లో ఒక‌రోజు అవ‌మానం జ‌రుగుతుంది. ఏడాది తిరిగేలోపు సినిమా చేస్తాన‌ని ఆ ద‌ర్శ‌కుడితో స‌వాలు చేసి వ‌స్తాడు. అలా క‌థ‌ల కోసం అన్వేషిస్తుండ‌గా, ఓ విల‌న్ క‌థ‌తో సినిమా తీయాల‌ని అనుకుంటాడు. అందుకే నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల కోసం జైళ్ల చుట్టూ తిరుగుతుంటాడు. అలా అత‌నికి గ‌ద్ద‌ల‌కొండ‌లో ఓ వ్య‌క్తి ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఇత‌ను అక్క‌డికి వెళ్లే స‌రికి అత‌న్ని గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వ‌రుణ్‌తేజ్‌) హ‌త్య చేసి ఉంటాడు. ఆరా తీస్తే గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌ రౌడీ షీట‌ర్ అనీ, ఆ ప్రాంతంలో అత‌నంటే హ‌డ‌ల్ అనీ, లోక‌ల్ ఎమ్మెల్యే స‌పోర్ట్ ఉంద‌నీ తెలుస్తుంది. అనారోగ్యం పాలైన ఎమ్మెల్యే కొడుకు (వంశీ)కి అండ‌గా నిలుస్తాడు గ‌ణేష్‌. త‌న స్నేహితుడు ద్వారా గ‌ణేష్ గురించి మొత్తం తెలుసుకున్న అభి, అత‌ని వ్య‌క్తి గ‌త జీవితాన్ని గురించి తెలుసుకోవ‌డానికి అత‌నికి కాస్త ద‌గ్గ‌రైన బుచ్చ‌మ్మ‌(మృణాళిని)ని ప్రేమిస్తున్న‌ట్టు న‌టిస్తాడు. ఎలాగైతేనేం చివ‌రికి అత‌ను గ‌ణేష్‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. గ‌ణేష్ గ‌త జీవితాన్ని గురించి, ప్రేమ‌ను గురించి అత‌ని నోటి వెంట‌నే విని తెలుసుకుంటాడు. దాన్ని పెట్టి `సీటీమార్‌` అనే సినిమా చేస్తాడు. ఆ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా గ‌ణేష్‌కి బుచ్చ‌మ్మ మీద మ‌న‌సు మ‌ళ్లుతుంది. అయితే అప్ప‌టికే అభితో ప్రేమ‌లో ఉన్న బుచ్చ‌మ్మ‌, అభితో వెళ్లిపోతుంది. ఆ విష‌యం తెలుసుకున్న గ‌ణేష్ ఏం చేశాడు? త‌న‌కు సినీ జీవితం ఇచ్చాడ‌ని అభిని వ‌దిలేశాడా? లేకుంటే చంపేశాడా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు
- డైలాగులు
- న‌టీన‌టుల గెట‌ప్పులు, పెర్ఫార్మెన్స్ లు
- సంగీతం
- ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట‌
మైన‌స్ పాయింట్లు
- క‌థ ముందే తెలిసిపోవ‌డం
- ఆక‌ట్టుకోని సెకండాఫ్‌v - నిడివి

విశ్లేష‌ణ‌
గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అనే ఈ సినిమా పూర్తిగా మాస్ సినిమా. ఆ మాస్ సినిమాకు త‌గ్గ‌ట్టు వ‌రుణ్ తేజ్ గెట‌ప్ బాగా కుదిరింది. అత‌ని ఎత్తు, ఉంగ‌రాల జుట్టు, పెద్ద గ‌డ్డం ఈ కేర‌క్ట‌ర్‌కు సూట్ అయ్యాయి. కుడి కంటికింద ఆరిన గాయం తాలూకు మ‌చ్చ‌, దానికో స్టోరీ.. అన్నీ బాగా కుదిరాయి. శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించింది కొద్దిసేపే అయినా పూజా హెగ్డే ఆక‌ట్టుకుంది. అధ‌ర్వ‌కి తెలుగులో తొలి సినిమా అయినా మెప్పించాడు. ఆ పాత్ర‌కు స‌రిపోయే తెలుగు హీరోలు చాలా మంది ఉన్నారు. అయినా కొత్త‌ద‌నం కోసం అధ‌ర్వ‌ను ప్ర‌య‌త్నించారు. అత‌ను త‌న ప‌రిధి మేర బాగా చేశారు. మృణాళిని అల్ల‌రి పిల్ల‌గా బాగా చేసింది. పెళ్లిచూపులు సీన్ న‌వ్వించింది. అవ‌కాశం - క‌ష్టం గురించిన డైలాగులు, సినిమాకు సంబంధించిన డైలాగులు, కాంప్ర‌మైజ్‌-అడ్జ‌స్ట్ మెంట్ గురించి త‌నికెళ్ల‌భ‌ర‌ణి చెప్పే డైలాగులు అర్థ‌వంతంగా అనిపించాయి. స‌మ‌యం అనుకూలించిన ప్ర‌తి చోటా త‌న మార్కు డైలాగు చెప్ప‌డానికే ప్ర‌య‌త్నించాడు హ‌రీష్ శంక‌ర్‌. ఒరిజిన‌ల్ స్టోరీకి ఆయ‌న చేసిన మార్పులు కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేవే. ఇందులో బిందెలతో తెర‌కెక్కించిన ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట‌ను ప్ర‌త్యేకంగా చెప్పాలి. పాత పాట‌ను గుర్తుచేసుకోవ‌డం ఒక ఎత్త‌యితే, పాత పాట‌లో ఉన్నంత మాధుర్యం ఇందులో లేదేమో అనిపించింది. ఇంకా బాగా తీయాల్సిందేమోన‌ని థియేట‌ర్లో గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఆ పాట‌లో వ‌రుణ్‌, పూజా మాత్రం ఒదిగిపోయారు. సెకండ్ హీరో అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నించే చింత‌పండు వ్యాపారి కొండ‌మ‌ల్లిగా క‌మెడియ‌న్ స‌త్య పాత్ర బాగా పేలింది. అధ‌ర్వ‌, మృణాళిని మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కొన్నిచోట్ల పేల‌వంగా అనిపించాయి. కొడుకు కోర్టులో చెప్పిన ఒక్క అబ‌ద్ధానికి శిక్ష‌గా త‌ల్లి అత‌నితో కొన్ని ఏళ్ల పాటు మాట్లాడ‌క‌పోవ‌డం, మ‌ళ్లీ అత‌ని సినిమా చూసి మంచి ప‌ని చేయ‌మ‌ని చెప్ప‌డం ఆక‌ట్టుకునే స‌న్నివేశం. మొత్తానికి ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు న‌చ్చేవారికి ఈ సినిమా న‌చ్చుతుంది

Tags : Valmiki Movie Review, Varun Tej Gaddalakonda Ganesh Review

Write a comment ...
Post comment
Cancel