back

జనసేన తరపున అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ప్రచారంShare via:

జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేనాని, ఆ తరవాత తెగతెంపులు చేసుకుని ప్రస్తుతం ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్రను మొదలుపెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన తరవాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.

పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఏనాడు ఆయనతో ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణే వాళ్లను దూరం పెట్టారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరవాత చిన్న అన్నయ్య నాగబాబును పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు, ఆయన భార్య పద్మజ, కుమార్తె నిహారిక నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, పవన్ పోటీకి దిగిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

జనసేన తరఫున మెగా హీరోలు ప్రచారం చేస్తే జనసేనకు మరింత ప్లస్ అవుతుందని జనసైనికులు, మెగా అభిమానులు భావిస్తు్న్నారు. వాళ్లకు నాగబాబు సతీమణి పద్మజ తీపి కబురు అందించారు. వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఖరారు చేశారు. వరుణ్ తేజ్ ఏప్రిల్ 5న అమెరికా నుంచి తిరిగొస్తారని.. ఆ తరవాత ఆయన, బన్నీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ విషయం చెప్పారు.

Tags : Janasena, Allu Arjun, Varun Tej

Write a comment ...
Post comment
Cancel