back

రాంగోపాల్ వర్మ వెధవ నాటకం ఆడుతున్నాడు - అల్లు అరవింద్Share via:

తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే పొడిచిన వాడిలా, తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తల్లిలాంటి తెలుగు పరిశ్రమకు రామ్‌గోపాల్‌ వర్మ ద్రోహం చేస్తున్నాడని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్‌ మాట్లాడుతూ... ‘‘తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేలా ఇలాంటి ఘటనలు ఏమిటా? అని అందరూ బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని దూషించాలని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు వర్మ అన్నాడు. రామ్‌గోపాల్‌ వర్మ అండ్‌ కో ఒక నీచపు వర్గం. ‘సురేష్‌ ఫ్యామిలీ నుంచి రూ.5కోట్లు ఇప్పిద్దామని ప్రయత్నించాను ఒప్పుకోలేదు’ అని వర్మ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తే నీకు రూ.5కోట్లు ఇస్తామన్నది ఎవరు? నీ సామర్థ్యం నాకు తెలుసు, నీకు అంత స్థాయి లేదు, ఇవన్నీ చూసి రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒక మనిషి ఎదుగుతుంటే ఎలా దెబ్బతీయాలనే కుట్ర ఇది.

నీ తల్లిని నాలుగు బూతులు తిట్టిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. కానీ, మేం అలాంటి నీచమైన పని చేయం. అమ్మాయి ఎమోషనల్‌గా వెళ్లి ‘రామ‌గోపాల్‌ వర్మ ఇలా అనిపించాడు’ అని చెప్పేలోపే ‘ఇదంతా నేనే చేయించా’నని వీడియో బయటపెట్టి చీప్‌ ట్రిక్‌ చేస్తున్నావు. ‘సురేష్‌ ఫ్యామిలీ ఏమవుతుందోనని ఆందోళనతో మాట్లాడి డబ్బులు ఆఫర్‌ చేశా’ అని చెబుతున్నావు. చిరంజీవి కుటుంబం అంటే నీకు పడదు గనుక, సురేష్‌ కుటుంబాన్ని కాపాడుతానంటూ ఇంత నాటకమాడతావా. ఇదంతా నీకు అవసరమా. ఇలాంటి నీచుడ్ని ఏం చేస్తారో ఇండస్ట్రీ పెద్దలకే వదిలేస్తున్నా. నీ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉండి చేయించింది ఎవరు? నీ కుట్ర భాగస్వాములు ఎవరు? వీటికి సమాధానం చెప్పాలి. ఇలాంటి డ్రామాలు.. పన్నాగాలు.. పీఆర్పీలో మాకు జరిగాయి.

డియర్‌ పవన్‌.. ఫ్యామిలీ షేడ్‌ పడకుండా ఒంటరిగా ప్రజల్లోకి వెళ్తున్న నీ పంథాను గౌరవించి మేమంతా దూరంగా ఉంటున్నాం. పీఆర్పీలో ఇలాగే అనేక కుట్రలు జరిగాయి. అది తట్టుకోలేక ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.

‘‘బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాన్ని చాటాం. మహిళా సంఘాల నేతలు కూడా చిత్ర పరిశ్రమ కృశించి పోయేలా మాట్లాడవద్దని కోరుతున్నా. హత్య కేసులో పొడిచిన వారికంటే హత్యకు ప్రణాళిక పన్నిన వారికే ఎక్కువ శిక్ష పడుతుంది. ప్రస్తుత కేసులో శ్రీరెడ్డి కంటే ఆమె వెనుక ఉండి మాట్లాడిస్తున్న వారిపైనే ఎక్కువ చర్యలు ఉంటాయి. చిత్ర పరిశ్రమలో సీనియర్‌గా నాకంటూ ఓ బాధ్యత ఉంది. రెండు మూడు తరాలుగా చిత్ర పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నాం. పరిశ్రమలో ప్రతి సంస్థ ఓ కమిటీ పెట్టుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిటీ పని చేయాలి’’ అని అల్లు అరవింద్‌ వెల్లడించారు.

Tags : Allu Aravind Press Meet, Ram Gopal Varma, Pawan Kalyan, Sri Reddy

Write a comment ...
Post comment
Cancel